Sunday, May 28, 2023

పిపీలకములు - (రాజమండ్రి రాతలు )

(" రాజమండ్రి రాతలు " సిరీస్ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు గమనించిన విషయాల మీద మదిలో సోది అన్నమాట  )

అర్ధమైంది . పిపీలకం అంటే చీమలని  . చిన్నప్పుడు, నాకేంటి ఎవరికైనా వడి వడిగా , కొంపలు ములిగిపోయినట్టు , టింగు టింగు మని వెళ్లిపోయే చీమలని చూస్తే అదో విధమైన ఆసక్తి . అయితే అన్ని సార్లు చీమల్ని అంత  దగ్గరగా , ఒక్కోసారి భూతద్దంతో పరిశీలించినా  , కనీసం ఒక్కసారి కూడా ఒక చీమని , ఇంకో చీమ డమాల్న గుద్దుకుని అంత  దూరం ఎగిరిపడటం , లేదా లుంగ చుట్టుకుని దారికి ఒక వైపుకు దొర్లుకుంటూ పడిపోవటం కనిపించలేదు . భలే  ఆశ్చర్యం వేసేది . బహుశా అది చీమలలో ఉండే క్రమశిక్షణ కావచ్చు లేదా స్కిల్ అవ్వొచ్చు .

డిట్టో అట్లాటి  స్కిల్ మా రాజమండ్రిలో  లూథరన్ చర్చి దగ్గర చూసి భలే భలే  అనిపించింది . కూడలిలో ఒక వైపు కోరుకుండ రోడ్ నుంచి , ఇంకో వైపు కంబాల చెరువు దగ్గర నుంచి , మరో వైపు పేపర్ మిల్ దగ్గర నుంచి , మరోటి అపోజిట్ వీధిలోంచి , డివైడరు కి ఉన్న ఒక చిన్న సందులోంచి అన్ని సైజులలో ఉన్న అన్ని వాహనాలు అవలీలగా అటు ఇటు వెళ్లిపోతుంటే వారెవ్వా అనిపించింది . నా వాహనం ఆ వాహనాలలో ఒకటైనప్పుడు భళారే అని నాకు నాకే అనిపించింది.

అలవాటులో పొరపాటు ( రాజమండ్రి రాతలు )

(" రాజమండ్రి రాతలు " సిరీస్ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు గమనించిన విషయాల మీద మదిలో సోది అన్నమాట  )

ఈసారి కూడా నన్ను పెంచి పెద్దచేసిన మా ఊరు (అముజూరు) వెళ్లి, మా పిల్లకి ( ఇప్పుడు కొంచెం పెద్దదై ఓ మోస్తరు ఇంగిత జ్ఞానం వచ్చింది కాబట్టి ) నేను చదివిన మా హైస్కూల్ , బోర్డు స్కూల్ ( ఎందుకు అలా అనేవాళ్ళమో నాకు ఇప్పటికీ తెలీదు  ) చూపించి , మాకు ఉండే వసతులు చూపించి ,మా కస్టాలు ఏకరువు పెట్టడం మొదలెట్టానో లేదో మా పిల్ల " బాబోయ్ ఇంక ఆపేయ్ నాన్నోయ్" అని క్లాసు పర్వానికి తెర  దించమని నిరసన ప్రదర్శించింది . మా ఇంటావిడ చదువు కూడా పట్నంలో కాన్వెంట్ చదువేమో , సానుభూతి ప్రదర్శించకపోగా "సదివేవులే పెద్ద కలెట్టరు సదువు " అన్నట్టు చూసేటప్పటికి క్లాసు పర్వానికి నిజంగా తెర దించాల్సి వచ్చింది .

        మా ఊరి గొల్లాలమ్మకి దణ్ణం పెట్టుకుని , ఎదురుగా ఉండే మా మాస్టారి ఇంటికి వెళ్లి కాసేపు మాటాడి , ఇంక వెనక్కి బయలుదేరి వచ్చేస్తుంటే మాస్టారు మా పిల్లతో బాగా చదువుకోవాలి మరి అని అంటుంటే అన్నేళ్ల అలవాటో ఏమో బుర్ర గంగిరెద్దులా ఊపి " బాగా చదువుకుంటాను మాస్టారు " అనేశా . ఇది విన్న ఇంటావిడ ఒకటే నవ్వు . ఆ తర్వాత మనిషి నిరంతర విద్యార్థి అని కవర్ చేశా కానీ పెద్ద లాభం లేకపోయింది .అలవాటులో అదన్నమాట

గుర్తుండిపోయారు ( రాజమండ్రి రాతలు )

(" రాజమండ్రి రాతలు " సిరీస్ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు గమనించిన విషయాల మీద మదిలో సోది అన్నమాట  )

గుర్తుండిపోయింది దక్షారామం భోగీశ్వరుడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే మరిచిపోయే ప్రసక్తే లేదు కాబట్టి . మొదటగా దక్షుడు ద్రాక్షగా ఎప్పుడు మారిపోయాడో తెలీదు కానీ దక్షారామం కాస్తా ద్రాక్షారామం అయ్యికూర్చుంది .  మా తూగోజీ ఒకింత ముందుకెళ్లి దాచ్చారం చేసేసింది . మా ఊళ్ళో అలాగే పిలుచుకునేవాళ్ళం ముద్దుగా.

భీమేశ్వరుడి దర్శనం దగ్గర, ఆ తర్వాత అమ్మవారి దగ్గర మరలా వెనకాల వీరభద్రుడి దగ్గర ఓ ఇద్దరు మనుషులని పదే పదే చూడటం జరిగింది . దర్శనం అయ్యిన తర్వాత అలవాటు ప్రకారం అమ్మవారి మండపం పక్కన కూర్చుని ఉంటే మళ్ళీ వాళ్లిద్దరూ గుడి చుట్టూ చేతులు పట్టుకుని పదే పదే తిరగటం గమనించాను .

ఆ ఇద్దరూ 55 ఏళ్ల పైబడిన ఓ ఇద్దరు వ్యక్తులు . ఇద్దరూ షర్ట్ టక్ చేసుకుని నాకైతే ప్రభుత్వ ఉద్యోగస్తులేమో అనిపించింది . చేతులు వదలకుండా పట్టుకుని నడవడం ఇంకా వింతగా అనిపించింది . పైగా ఒకాయన ఇంకొకాయనకు అమ్మ వారి ఎదురుగుండా ఉన్న బొట్టు పెట్టేవారు . 

మొదట్లో నాకైతే కొంచెం ఎక్కువయిందేమో అనిపించింది . తర్వాత ఆసక్తి పెరిగింది . కాసేపటికి కుతూహలం మొదలైంది . ఇంకాసేపటికి భలే ముచ్చటేసింది .చివరికి అలోచించి చిన్ననాటి స్నేహితులని , బహుశా ఎదో స్కూల్ లేదా కాలేజీ రీయూనియన్ పండగకి వచ్చి ఇలా ఇక్కడకి వచ్చి ఉంటారని నేను తేల్చి చెప్పేశాను .

నాకన్నా మా ఇంటావిడకి కొంచెం చొరవ ఎక్కువ కాబట్టి  తనే వెళ్లి వాళ్ళతో మేము గమనించింది అంతా చెప్పి , మీరు స్నేహితులా అని అడిగేసింది . వాళ్లలో ఒకాయన ఇచ్చిన సమాధానం నన్ను చాలా అబ్బురపరిచింది .వాళ్లిద్దరూ అన్నదమ్ములు . అంటే చేతులు పట్టుకుని నడిస్తేనే అన్నదమ్ముల ఆప్యాయతలు ఉంటాయా అని అడగొద్దు . అది చూసి తీరాలి . ఇప్పుడు ఉన్నా సమాజం , అన్నదమ్ముల ఆప్యాయతలుతో పోలిస్తే నాకు మాత్రం అంతకు మించి అనిపించింది . 

వెనక్కి తిరిగి వచ్చేసిన తర్వాత ఒక వింత గమనించాను . అదేంటంటే వాళ్ళ మొహాలు నాకు ఏదో చిన్నప్పటి నుంచి చూసిన మొహాల వలె ఇప్పటికీ చాలా స్పష్టంగా , మెదడులో కాకుండా , గుండెకాయలో నిక్షిప్తం అయిపోయినట్టున్నాయి . వాళ్ళని నేను బహుశా ముందు నుంచి ఒక రెండుసారులు చూశానంతే . పోకిరీ డైలాగులా ఎంత సేపు చూశామన్నది  కాదు,  నీ మనోఫలకం మీద ఎంత గాఢమైన ముద్ర వేశారన్నది ముఖ్యమని అనిపించింది . 

బహుశా రామ లక్ష్మణులేమో ..

అపుడో ఇపుడో ఎపుడో ( రాజమండ్రి రాతలు)

(" రాజమండ్రి రాతలు " సిరీస్ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు గమనించిన విషయాల మీద మదిలో సోది అన్నమాట  )

ఇది వినటానికి అంత వింపుగా లేకపోయినా , అంతో ఇంతో కంపుగా అనిపించినా ఇందులో జీవిత సత్యం దాగి ఉంది కాబట్టి  ఈ అంశం చెపుతున్నా . హార్వర్డ్ లో  చదివిన డాక్టరైనా చెప్పేదేమిటంటే మొదటి రుగ్మతకు మందు ఉంది కానీ రెండో రుగ్మతకు మందు లేదని . పైగా రెండింటికీ కార్భో హైడ్రేటుకి , ఫైబర్ కీ ఉన్నంత తేడా ఉందని. పాత రాతి యుగాల నుంచీ మల బద్దకాన్ని వ్యాధిగా పరిగణిస్తే , మల విసర్జన బద్దకాన్ని అనాదిగా మానసిక పరిపక్వత లోపించటంతో  పోలుస్తారు . అంటే ఒకరికి వెల్దామన్నా రాదు. ఇంకొకరికేమో వచ్చినా వెల్లబుద్దెయ్యదు. మరి ఈ రెండో లైఫ్ స్టైల్ డిసీజ్ కి మందు లేదా అంటే లేదు కానీ ఈ బద్ధకం వల్ల అపుడో ,ఇపుడో , ఎపుడో జరిగే ఒక ఆపలేని అఘాయిత్యం మాత్రమే పరిష్కార మార్గం చూపుతుంది 

( ఎందుకు ఇలా రాయాలనిపించింది అని అడగ గకపోవటం నాకు, మీకు, అందరికీ శ్రేయస్కరం 😊)

ఉలా ( రాజమండ్రి రాతలు )

(" రాజమండ్రి రాతలు " సిరీస్ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు గమనించిన విషయాల మీద మదిలో సోది అన్నమాట  ) 

అస్సలా అలా అనుకోవద్దు . ఇది స్పానిష్ కాదు . ఇండియాలో ఉన్న రెండు ముఖ్యమైన క్యాబ్ సర్వీస్ లన మిక్సీలో వేస్తే వచ్చినదన్నమాట .క్యాబ్ ఎక్కినప్పుడు డ్రయివర్ పక్కన కూర్చుని వాళ్ళతో ఏదో పిచ్చాపాటి మాటాడం అలవాటు . రాత్రిళ్ళు లేదా తెల్లవారుజామున మాటాడకపోవటం ప్రాణాంతకం కూడా . ప్రతీ సారీ కనీసం ఒక ఆసక్తికరమైన లేదా ఆలోచన రేకెత్తించే నిజమైన కథ ఒకటైనా వింటాను . ఈసారి రెండు విన్నాను 

మొదటిది మోతీనగర్ నుంచి కాచీగూడా రైల్వే స్టేషనుకి . ఇతను రావటమే ధూమ్ ధామ్ గా వచ్చారు . డోర్ తీసి లోపలి ఎక్కేలోపే ఒక వంద మాటలు నోట్లోంచి ప్రవాహంలా వచ్చేశాయి పక్కా హైద్రాబాదీ హిందీ లో . మరి మనదేమో "రఘుతాతా" విందీ  కాబట్టి ముందే సెలవిచ్చా మహాప్రభూ నాది చుట్టీపాత్ర హిందీ అని . అయినా "ఫికర్ న కో " అని ఇంగ్లీషులో మొదలెట్టారు . ఈయన ముస్లిం . నలుగురు అమ్మాయిలు . ఇద్దరు అమ్మాయిలని డాక్టర్ చదివిస్తున్నారు . మూడో అమ్మాయి బి ఫార్మసీ చదువుతోంది . చివరి అమ్మాయి 8 తరగతి చదువుతుంది . కేవలం కారు నడుపుతూ ఇది ఎలా సాధ్యం అని అర్ధం వచ్చేలా అడిగితే ఇంకా చాలా పనులు చేస్తానని , వీలు దొరికినప్పుడల్లా ఇది కూడా అని , కేవలం చదువే తన పిల్లల భవిష్యత్తుని మారుస్తుందని , నేను ఇంత సరదాగా కనిపించినా , చదువు దగ్గర చాలా స్ట్రిక్ట్ అని , అది నా పిల్లలకి కూడా బాగా తెలుసని చెపుతా ఉంటే భలే ముచ్చట వేసింది . ముఖ్యంగా సాయంత్రం  ఆరు గంటలకి ఆ లెవెల్లో ఉన్న ఎనర్జీ చూసి ఆశ్చర్యమేసింది .

రెండవది మోతీ నగర్ నుంచి ఎయిర్ పోర్ట్ కి వెనక్కి రావటానికి . సాధారణంగా ఈ ప్రయాణం ఒకపక్క కర్మభూమిని వదిలి వెళ్ళిపోతున్నామని మనసంతా కకావికలమై ఉంటే,  మరో పక్క మన ఇంటికి వెళ్ళిపోతున్నామనే ఆలోచన ఉపశమనాన్ని ఇస్తూ ఉంటుంది . ఆపీసు గుర్తొచ్చి మనసంతా పిసికేసినట్టు ఉన్నా రెక్క ఆడించాలి కదా మరి డొక్కాడటానికి . ప్రయాణం రాత్రి కాబట్టి డ్రయివర్ని కదలించాను . ఇది మరో ఉత్తేజపూరితమైన నిజమైన కథ . జీవితం ఆటో నడపటంతో మొదలయ్యి , క్రమంగా ఎలా ఎదిగారో , ఈరోజు ఎన్ని ఆస్తులు సంపాదించారో , ఎన్ని రాత్రులు కుటుంభానికి దూరంగా , కుటుంభం గురుంచి గడిపారో  చెప్పి ఏరోజు కూడా కష్టం కింద అనిపించలేదని , జీవితంలో ఎదుగుదల ఉండాలని చెప్పి , ఇదంతా తన సైడ్ బిజినెస్ అని పగలంతా ఒక డాక్టర్ దగ్గర పని చేస్తానని చెప్పేటప్పటికీ నాకైతే మతి పోయింది . 

ఇదంతా సగం ప్రయాణం అయితే , మరో సగం చేతులెత్తి మొక్కే కథనం . వాళ్ళ నాయన 45 రోజులు క్రితం కాలం చేశారని చెప్పి , ఇంక తన గురుంచి చెప్పటం మానేసి వాళ్ళ నాయన గురుంచి మాత్రమే చెప్పారు . బహుశా ఆ అరగంటలో " మా నాయన" అనే పదం ఒక 500 సార్లు అని ఉంటారు . చాలా సార్లు గొంతుక బొంగురు పోయింది నాన్న గురుంచి చెపుతుంటే , కళ్ళలో సన్నటి తేమ పొర . చివరగా ఆయన "సార్ ..ఇంత  కాలం నేను చాలా సాధించాను అనుకున్నాను కానీ మా నాయన పోయిన తర్వాత నేను ఏమీ కాదు సూన్యం అని తెలిసివచ్చింది " అని ఇంక ఏమీ మాట్లాడలేదు . నేను కూడా ఏమీ మాట్లాడించలేదు . అన్ని సంవత్సరాలు ఆయనకి అరగంట తెర మీద కనపడితే ,ఆ ఉద్వేగం చల్లబడటానికి ఆ మాత్రం సమయం అవసరం .

కన్న వారి మీద ప్రేమ, సంపదలలో ఉందో లేదా సంపదలతో సంభంధం లేని సంస్కారం లో ఉందో ..

పిపీలకములు - (రాజమండ్రి రాతలు )

(" రాజమండ్రి రాతలు " సిరీస్ ఈ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు గమనించిన విషయాల మీద మదిలో సోది అన్నమాట  ) అర్ధమైంది . పిపీ...