Thursday, April 27, 2023

కర్త - కర్మ - క్రియ ( రాజమండ్రి రాతలు )

(" రాజమండ్రి రాతలు " సిరీస్ ఈ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు గమనించిన విషయాల మీద మదిలో సోది అన్నమాట  )

ఇది కొట్టి పడేసేడంత చిన్న విషయం కాదు . అట్లాగని నెత్తి మీద వేసుకొని  పోట్లాడే అంత పెద్ద విషయం కాదు . కాకపోతే తప్పకుండా మనిషికి అట్టుడికి పోవడం , చేష్టలు ఉడికిపోవడం లాంటివి అంటే ఏంటో అనుభవ పూర్వకంగా తెలియజేస్తుంది. ఇక విషయానికొస్తే..

మొదటగా కర్త గురించి.ప్రపంచంలో కాంతారావు తర్వాత చిక్కడు దొరకడు మరొకడు ఎవడైనా ఉన్నాడంటే వాడే వీడు . వీడు చిక్కడు మాత్రమే కాదు చెక్కేవాడు కూడా. ప్రపంచం నిద్రించే వేళ వీడు తన సామాగ్రితో ఒక ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు. కోడి కూసేటప్పటికీ , కోడికి కూడా తెలియకుండా తను సృజించాల్సిన విషయాన్ని గోడమీద చెక్కి చక్కా వెళ్ళిపోతాడు.  

ఇప్పుడు కర్మ వంతు. సాధారణంగా రాత్రి జరిగిన ఈ సృజన ఆ ఇంటి వాడికి ఎవరో చెప్తే గాని తెలియదు. ఎందుకంటే ఇది ఇంటి బయట గోడమీద జరిగిన యవ్వారం కాబట్టి. ఇంటి ముందు నడిచి రోడ్డుమీద వెళ్లే వాడికి ముందు కనబడుతుంది.ఆ తరువాత ఏమి జరిగినా అప్పటికప్పుడు మాత్రం జరిగేది ఆ గృహస్తు గోడ మీద జరిగిన ఆ వికృత చేష్ట చూసి అట్టుడికి పోవడం.  ఇది చాలా వింత పరిస్థితి. పగవాడికి కూడా రాకూడనిది. ఈ విషయం మీద ఎంత పెద్దగా గగ్గోలు పెడితే ఆ గృహస్తు ఆ లెక్క కామెడీ అయిపోతాడు. కోపం , అవమానం , దిక్కు తోచనితనం, దిగ్భ్రాంతి లాంటి ఎమోషన్స్ శాంతించి కామన్ సెన్స్ ట్రిగ్గర్ అయిన తర్వాత తార్కికంగా ఆలోచించడం మొదలు పెడతాడు.ఉన్నవి రెండే మార్గాలు .మొదటిది పెయింటర్ కి కాంట్రాక్ట్ ఇచ్చి గోడమీద జరిగిన సృజనను చెరిపించుకోవడం లేదా మన గోడ ద్వారా సమాజ సేవ జరుగుతుందని వదిలేయటం.  దీనినే కర్మ అంటారు

ఇప్పుడు క్రియ గురించి. సాధారణంగా ఒక పని దొంగ చాటుగా చేస్తూ ఉంటే కాళ్లు చేతులు వణకటం సహజం. ఆశ్చర్యం ఏంటంటే వాడు ఈ పని  దొంగ చాటుగా చేస్తున్న, చెయ్యి ఏ మాత్రం వణకదు  . అక్షరాలు బత్తాయికాయల్లా గుండ్రంగా ఉంటే , అంకెలు అరమోడ్పు కన్నులతో మనవైపు చిలిపిగా చూస్తూ ఉంటాయి . ఇది నిజంగా వాడి టాలెంట్. దీన్ని మెచ్చుకోకుండా  ఉండలేము . 

అదే అందరికీ చిర పరచితమైన సెప్టిక్ క్లీన్ యాడ్. ఇల్లు పది లక్షలైనా లేదా , 10 కోట్లదైనా వాడి కంట పడ్డాదంటే గబ్బు లేవడం ఖాయం. మా ఊరి గొల్లాలమ్మ మీద ఆన ..ఈ యాడ్ వ్రాసేవాడిని ఇప్పటి వరుకు  , వ్రాస్తూ ఉండగా,  ఒక్కసారి కూడా చూడలేదు .

పిపీలకములు - (రాజమండ్రి రాతలు )

(" రాజమండ్రి రాతలు " సిరీస్ ఈ మధ్య రాజమండ్రి వెళ్ళినప్పుడు గమనించిన విషయాల మీద మదిలో సోది అన్నమాట  ) అర్ధమైంది . పిపీ...